అమరావతిలో చంద్రబాబు.. మర్మమేమిటో..?

0
91

2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. అమరావతి ఉద్యమం సమయంలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో పర్యటించిన టీడీపీ అధినేతకు విశాఖలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ సమావేశాలు మినహా మిగిలిన సమయాల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే గడిపారు.

ఇక లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ కి వెళ్లిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి దాదాపు 3 నెలలు సమయం తీసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో అందుబాటులో లేకుండా పోయారంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. జూమ్ బాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ఏడు నెలలుగా చంద్రబాబు, ఆయన తనయుడు కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా జూమ్ కి పరిమితమయ్యారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. జనాలను ఆదుకునేందుకు ఆయన వ్యక్తిగతంగా ఏమైనా సహాయం అందించారా అని ప్రశ్నిస్తున్నారు.

వయసు రీత్యా చంద్రబాబు బయటకు రాలేకపోయినా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇంటికే పరిమితం కావడం, బరువు తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు నాలుగు నెలల తర్వాత రాష్ట్రానికి వచ్చినప్పటికీ మళ్లీ మూడు రోజులకే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ప్రతి రోజూ జూమ్ యాప్ ద్వారా మాత్రం ప్రెస్ మీట్ పెడుతున్నారు.

చంద్రబాబు ఏపీ వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు జాతీయ రహదారిపై ఘనంగా స్వాగతం పలికారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.
అయితే తాజాగా దాదాపు నెలరోజుల తర్వాత చంద్రబాబు మళ్లీ అమరావతి చేరుకున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించి మరి హంగామా చేసిన నేతలు ఈసారి మాత్రం ఎక్కడా కనిపించలేదు. బాబు పర్యటన వివరాలను కనీసం మీడియాకు వెల్లడించలేదు.

ఇక చంద్రబాబు తీరుపట్ల ఆయన పార్టీ లోనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ విషయాన్నీ పలువురు చంద్రబాబు ముందు ప్రస్తావించారు. ఏపీని వదిలి హైదరాబాద్ లో స్థిరపడిన సమయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఇప్పటికే చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు కూడా. తాజాగా రాజధాని అమరావతి అంశంలో హైకోర్టులో రోజువారీ విచారణ మొదలయ్యింది. వాటిని ప్రభావితం చేసే ప్రతీ అంశాన్ని టీడీపీ వదలడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here