ఏపీలో వరద ఎఫెక్ట్… 10 మంది మృతి…

0
45

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జంట నగరాల్లో దాదాపు 1500 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 26 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా రెండు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మరణించారని సీఎం కార్యాలయం వెల్లడించింది.

భారీ వర్షాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలవారీగా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపత్యంలో కలెక్టర్లు, సంబంధిత అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమ‌త్తంగా ఉండాల‌ని జగన్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల మృతి చెంది 10 మంది కుటుంబ సభ్యులకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.

ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని సూచించారు. అదే సమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని, తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here