కలవరపెడుతున్న కాలిఫోర్నియా కార్చిచ్చు..

0
21

ఓ వైపు కరోనా వైరస్… మరోవైపు అధ్యక ఎన్నికల కోలాహలం… ఇంకోవైపు జాత్యహంకార పోరు… ఒకమాటలో చెప్పాలంటే అమెరికాలో ఇప్పుడు ఇదే పరిస్థితి. అగ్రరాజ్యం పత్రికల్లో పతాక స్థాయిలో నిలుస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పెద్దన్నను కార్చిచ్చు కలవరపెడుతోంది.

అమెరికాలో కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు చరిత్రలోనే ఎన్నడూ చూడని రీతిలో విజృంభిస్తోంది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతాన్నంతా కార్చిచ్చులు చుట్టుముట్టాయి. దారిలో ఎదురైన వాటినల్లా అవి బూడిద చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ కార్చిచ్చుల కారణంగా కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 15 మంది మరణించారు. మరో 16 మంది కనిపించకుండాపోయారు.

ఒరేగాన్ రాష్ట్రంలో 5 లక్షల మందిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అక్కడి జనాభాలో ఇది 10 శాతం కావడం గమనార్హం. సెప్టెంబర్ 5 ఉదయం ప్రారంభమైన ఈ మంటల కారణంగా ఇప్పటివరకు సుమారు 2000 ఇళ్లు, ఇతర బిల్డింగులు అగ్నికి ఆహూతి అయ్యాయి. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఎవరో కావాలనే నిప్పు పెట్టడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఇప్పటికే అవి దాదాపు 80 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని దహించి వేశాయి. కాలిఫోర్నియాతో పాటు ఫసిఫిక్ తీరమంతా ఇప్పుడు కార్చిచ్చులు అదుపు తప్పి మండుతున్నాయి.

అసాధారణమైన వేడి, ఎముకల్ని పిప్పిచేసేంత ఉక్క, తీవ్రమైన వడగాల్పులతో ఆ ప్రాంతమంతా అతలాకుతలం అవుతోంది. అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ సిబ్బంది తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సుమారు 14,000 ఫైర్ ఫైటర్స్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here