నో వర్చువల్… ఓన్లీ ఫేస్ టూ ఫేస్..

0
28

అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య వచ్చేవారం జరగాల్సిన రెండో డిబేట్ రద్దయ్యింది.  వర్చువల్ ద్వారా తాను చర్చలో పాల్గొనబోనని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడంతో డిబేట్‌ను రద్దుచేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అక్టోబరు 15న జరగాల్సిన డిబేట్ రద్దుచేస్తున్నామని, ఆ రోజున ఇరువురు అభ్యర్థులు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను తెలియజేయాలని కమిషన్ పేర్కొంది.

తాజా నిర్ణయంతో అక్టోబరు 22న టెన్నెసీలోని నాష్‌విల్లేలో చివరి డిబేట్ జరగనుంది. ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1976 నుంచి అభ్యర్థుల మధ్య డిబేట్ నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, 2000 నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేలోపు మూడు డిబేట్‌లు నిర్వహిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారినపడటంతో అక్టోబరు 15న జరగాల్సిన చర్చను వర్చువల్‌లో నిర్వహించనున్నట్టు కమిషన్ వెల్లడించింది. కానీ, ట్రంప్ మాత్రం వర్చువల్ ద్వారా చర్చ అంత ప్రభావవంతంగా ఉండదని, ఇందులో తాను పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ కరోనా వైరస్ నుంచి కోలుకోకుంటే డిబేట్ ఉండదని డెమోక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక, వర్చువల్ ద్వారా డిబేట్‌లో పాల్గొనడం లేదని ట్రంప్ చేసిన ప్రకటనపై డెమోక్రాట్లు విమర్శలు గుప్పించారు. ఇది చాలా సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.

‘ఓటర్లు ప్రశ్నలడిగే చర్చను డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం సిగ్గుచేటు.. కానీ ఆయన నిర్ణయం తమకు ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదు’ అని జో బిడెన్ అధికార ప్రతినిధి ఆండ్రూ బేట్స్ అన్నారు. ఓటర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ట్రంప్‌నకు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత శనివారం తొలిసారి బహిరంగ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొననున్నారు. వైట్‌హౌస్ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, స్క్రీనింగ్ నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. థర్మల్ స్క్రీనింగ్ సహా ఓ ప్రశ్నవళిని కూడా పూర్తిచేయాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here