పెను సంక్షోభంలో జపాన్…? ప్రధాని రాజీనామా..

0
65

ప్రపంచానికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న జపాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందా… పెను సంక్షోభం నుంచి జపాన్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదా… అంటే అవుననేలానే ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. హిరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబు దాడి జరిగిన తర్వాత ఛాలంజింగ్ గా కోలుకున్న జపాన్… ప్రపంచానికే సరికొత్త సాంకేతికతను పరిచయం చేసింది. ఆర్థికంగా కూడా జపాన్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా గతం. ప్రస్తుత పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా పని చేసిన రికార్డును నెలకొల్పిన అబే… తన పదవీకాలం ముగియడానికి మరో ఏడాది గడువు ఉండగానే అర్ధాంతరంగా తప్పుకొన్నారు. రాజీనామా ప్రకటన సందర్భంగా దేశ ప్రజలను క్షమించమని కోరారు. కరోనా వైరస్ వల్ల తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్నామని చెప్పారు.

కరోనా వైరస్ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితుల కారణంగా నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేకపోయామన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వర్తించలేకపోయానని…  అనారోగ్య కారణాల వల్ల వైదొలగాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. కొత్త ప్రధానమంత్రి దేశ ప్రజల కలలను సాకారం చేస్తారని బలంగా నమ్ముతున్నట్లు అబే ఆశాభావం వ్యక్తం చేశారు. షింజో అంబే.. కోలిటిక్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. పెద్ద ప్రేగునకు సంబంధించిన వ్యాధి అది. అది నయం కాకపోవచ్చనే అనుమానాలు ఇదివరకు విస్తృతంగా వినిపించాయి. ఇప్పుడా అనుమానాలను నిజం చేసేలా.. షింజో తప్పుకొన్నారు. ఎనిమిదేళ్లుగా తాను దీన్ని అదుపులో ఉంచుకుంటూ వచ్చానని, ఇప్పుడా పరిస్థితి లేదని షింజో స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోందని, ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవికి న్యాయం చేయలేననే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.

షింజో దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభాల వల్ల అందుకోలేకపోయామని, క్షమించమని కోరడం అందరి దృష్టినీ ఆకర్షించింది. జపాన్ ఆర్థికరంగంలో మున్ముందు మరిన్ని సంక్షోభాలు తప్పకపోవచ్చనే సంకేతాలు ఇచ్చినట్టైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక రంగం కుదేల్ అవుతోందనడానికి షింజో రాజీనామా చేయడాన్ని కారణంగా చూపుతున్నారు.

షింజో అబే రాజీనామా పట్ల జపాన్ మార్కెట్‌లో నెగెటివ్ ట్రెండ్ కనిపించింది. జపాన్ బెంచ్‌మార్క్‌గా చెప్పుకొనే నిక్కెయ్ ఇండెక్స్ 1.4 శాతం నెగెటివ్‌తో క్లోజ్ అయింది. జపాన్ కరెన్సీ యెన్.. స్వల్పంగా బలపడింది. అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే 0.3 శాతం బలపడింది. నూతన జపాన్ నిర్మాణానికి షింజో బాటలు పరిచారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త ఆర్థిక సంస్కరణలకు ఆయన తెరతీశారని విశ్లేషిస్తున్నాయి. అబెనమిక్స్ ద్వారా ఆర్థకరంగంలో సంస్థాగతమైన మార్పులు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఫలితంగా అటు వినియోగదారులు, ఇటు పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించారని పేర్కొంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here