ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడుతున్న దేవాలయాలు

0
40

టీటీడీ ఫైనాన్స్ కమిటీ బ్యాంక్ డిపాజిట్ల కంటే కేంద్ర ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలన్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయం ఉత్తమమైందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు చాలా ఉత్తమమని, మంచి వడ్డీ వస్తుందని సిఫార్సు చేసింది. తాము ఇచ్చిన నివేదికలో ఏప్రిల్2, 2019 నుంచి 17 జులై 2020 వరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన బాండ్లపై వస్తున్న వడ్డీ, బ్యాంక్ డిపాజిట్లపై వస్తున్న వడ్డీని పోల్చుతూ నివేదికలో పేర్కొంది. పైగా వివిధ రాష్ట్రాల్లో ఆయా దేవస్థానాల సొమ్ము డిపాజిట్ చేసేందుకు ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నాయో పేర్కొంది.

గుజరాత్ లోని శ్రీ సోమనాథ్ జ్యోతిర్లంగ ఆలయం నిధులను గుజరాత్ పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్-2011 నిధులను డిపాజిట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన పబ్లిక్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయొచ్చు…. లేదా స్థిరాస్థుల్లో పెట్టుబడి పెట్టొచ్చు. పబ్లిక్ సెక్యూరిటీలు అంటే కేంద్ర ప్రభుత్వ బాండ్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు, రైల్వే బాండ్లు, షేర్లలో… రాష్ట్రం లేదా కేంద్రం గ్యారంటీ ఇచ్చిన బాండ్లలో… రాష్ట్ర అసెంబ్లీ, కేంద్రం ఆమోదించిన స్థానిక సంస్థల బాండ్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. ద్వారకనాథ దేవాలయంలో కూడా ఇవే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో స్వామివారి నిధులు పెట్టుబడుల కోసం ప్రత్యేక నిబంధనలు చట్టంలో పేర్కొనలేదు. మధురలో కూడా ఎలాంటి నిబంధనలు లేవు.

కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా ఆర్బీఐ ఆమోదం పొందిన బ్యాంకులు, రాష్ట్ర ట్రెజరీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రామిసరీ నోట్లు, డిబెంచర్లు, షేర్లు, రైల్వేలు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.

జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి అలయంలో అమ్మవారి నిధులకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం దేవాలయ బోర్డుకు ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేవు. కర్ణాటక రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు షెడ్యూల్ బ్యాంకులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన బ్యాంకింగ్ సంస్థల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. మహారాష్ట్రలోని అన్ని దేవాలయాలు షెడ్యూల్డ్ బ్యాంకులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టుబడి పెడతారు.

షిరిడీ సాయి ఆలయంలో ట్రస్ట్ చట్టం ప్రకారమే ఇన్వెస్టిమెంట్స్ ఉంటాయి. భారతీయ బ్యాంకులు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన పబ్లిక్ సెక్యూరిటీలు, రైల్వేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన సంస్థల కంపెనీలు, రైల్వే షేర్లు… అయితే వీటిపై డివిడెండ్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం పొందిన స్థానిక సంస్థల డిబెంచర్లు… రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇక ఉత్తరాంఖండ్ లోని శ్రీ బద్రీనాథ్ అండ్ శ్రీ కేదార్ నాథ్ ఆలయాలకు సంబంధించిన నిధులను షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్టల్ శాఖ, ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెట్టాలన్న నిబంధన ఉంది.

మధ్యప్రదేశ్ లోని అన్ని దేవాలయాలు షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్టల్ శాఖ, రాష్ట్రం ఆమోదించిన కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోనే పెట్టుబడులు పెట్టాలి. అలా కాకుండా మరోచోట పెట్టుబడి పెట్టాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒడిశాలోని అన్ని ఆలయాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టల్ సేవింగ్స్ లోనే నిధులను ఉంచాలి. ప్రఖ్యాత పూరి జగన్నాథ ఆలయ నిధులను బ్యాంకుల్లోనే పెట్టుబడి పెట్టాలనే రూల్ ఉంది. రాజస్థాన్ లోని నాథద్వారా ఆలయానికి ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ లేవు.

తమిళనాడు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనే పెట్టుబడి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వ షేర్లు, ఇతర సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. ఏడాది దాటిన, పదేళ్ళలోపు డిపాజిట్లు మాత్రం బ్యాంకులు, కో ఆపరేటివ్ బ్యాంకుల్లో పెట్టాలి. పోస్టల్ సేవింగ్స్ లో, యూటీఐ యూనిట్లలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మొత్తానికి కొన్ని రాష్ట్రాలు తమ సెక్యూరిటీలలో కూడా దేవాలయాలు ఇన్వెస్ట్ చేయొచ్చనే నిబంధనలు తెచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here