మరో వివాదంలో టీటీడీ… శ్రీవారి సొమ్ముపై దుమారం

0
56

తిరుమల తిరుపతి దేవస్థానం… కోట్లాది మంది భక్తులకు అది వైకుంఠం. ఆదాయంలో కూడా టీటీడీ అగ్రస్థానంలోనే ఉంటుంది. నిత్యం వివాదాలతో సతమతమవుతున్న టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. శ్రీవారి సొమ్మును ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి మళ్లించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ దుమారానికి కారణమవుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో… శ్రీవారి సొమ్మును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి మళ్లించాలనే అంశం ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి… టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా… శ్రీవారి సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయ్యింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు చెల్లించే విరాళాలను… ‘వడ్డీ కోసం’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఆగస్టు 28న జరిగిన బోర్డు సమావేశంలో ఈ తీర్మానం చేసింది. డిసెంబరు నెల నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే… ఏపీ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పుడు… సొమ్ములు ఇచ్చి ప్రభుత్వ సెక్యూరిటీలు ఎలా పొందుతారన్న ప్రశ్న ఏపీ రాజకీయాల్లో తలెత్తుతోంది.

ఇప్పటి వరకూ టీటీడీ నిధులను షెడ్యూల్డు బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్‌ చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో దాస్తున్నారు. అలాంటిది టీటీడీ మొదటిసారిగా ‘ప్రభుత్వ సెక్యూరిటీ’లలో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుంది. జాతీయ బ్యాంకులేవీ ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం అత్యధికంగా 5.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అదే, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడితే, గరిష్ఠంగా 7 శాతం వడ్డీ వస్తుందని అని టీటీడీ అకౌంట్స్‌ విభాగం ఓ ప్రకటన సిద్ధం చేసింది. దీనిపై టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ ఆగస్టు 13న తీర్మానం చేసింది. అధిక వడ్డీ లభించేలా టీటీడీ నిధులను కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలి. ఈ ఏడాది డిసెంబరులో భారీ ఎత్తున డిపాజిట్ల కాల పరిమితి ముగుస్తుంది. అక్టోబరు లేదా నవంబరులో జరిగే బోర్డు సమావేశంలో… సొమ్ములను ఎందులో పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవాలని ఫైనాన్స్ కమిటీ సూచించింది.

పాలక మండలి మాత్రం కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కాకుండా… రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆగస్ట్ 28న చేసిన తీర్మానంలో… ‘కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో’ అని స్టేట్‌మెంట్‌లో రాశారు. ఇదే వివాదానికి కారణమైంది.

 టీటీడీ అన్నదాన ట్రస్టు, బర్డ్‌ ట్రస్టు, గోసంరక్షణ ట్రస్టు… ఈ మూడు ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ సొమ్ములతోనే నడుస్తున్నాయి. అందువల్ల, అధిక వడ్డీ కోసం సెక్యూరిటీలలో సొమ్ము డిపాజిట్‌ చేయాలని తీర్మానం చేయడంపై దుమారం రేగుతోంది. ప్రభుత్వానికి మేలు చేసేందుకే… టీటీడీ పాలక మండలి పెద్దలు ఈ తరహా తీర్మానం చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. టీటీడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ… విపక్షాలు ధర్నా చేపట్టాయి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే… ఎలాంటి పోరాటానికైనా దిగుతామని హెచ్చరించారు. శ్రీవారి సొమ్ములను వడ్డీ వ్యాపారం కోసం వాడుకోవాలను కోవడం సరైన నిర్ణయం కాదని టీటీడీ బోర్డు మాజీ సభ్యులు సూచిస్తున్నారు.

టీటీడీ తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విపక్షాలు చెబుతున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ కంటే కూడా ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేస్తే సెక్యూరిటీ ఉంటుందని టీటీడీ బోర్డు అంటోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here