రసవత్తరంగా దుబ్బాక పోరు

0
35

తెలంగాణలో అనూహ్యంగా వచ్చిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారని… ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని.. అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ సోలిపేట కుటుంబం పాత్ర ఉందన్నారు.

నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసమన్నారు. . జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే సోలిపేట సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు.

దుబ్బాకలో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. బీజేపీ తరఫున రఘునందన్ రావు పోటీ చేస్తున్నాడు. ఇప్పటికే రఘునందన్ తన ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు నర్సారెడ్డినే అభ్యర్థిగా అధిష్ఠానానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు.

దీంతో ఏఐసీసీకి నర్సారెడ్డి పేరును మాత్రమే పంపించినట్లు సమాచారం. నర్సారెడ్డితో పాటు శ్రవణ్ ‌కుమార్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డిల పేర్లకు కూడా చర్చకు వచ్చాయి. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మెజారిటీ నేతలు నర్సారెడ్డి అభ్యర్థిత్వానికే మొగ్గుచూపారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో ఉన్నారు.

దుబ్బాక ఉపఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. నవంబరు 3న పోలింగ్ జరగనుండగా… 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబరు 16. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 వరకు గడువు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పార్టీల ప్రచారం కూడా ఊపందుకుంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here