వరద సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

0
34

రెండు రోజుల పాటు కురిసిన భారీవర్షాలకు హైదరాబాద్ వణికిపోయింది. వర్షం తగ్గి 48 గంటలు కావస్తున్నా.. ఇప్పటికీ పలు కాలనీలు బురదలో చిక్కుకుని ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో బురద బాధలు మరో వారం రోజుల పాటు తప్పవనేది GHMC అధికారులు మాట. కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క నగర వాసులు నానా పాట్లు పడుతున్నారు. పరామర్శకు వస్తున్న నేతలను నిలదీస్తున్నారు.
తెలంగాణలో అకాల వరదల వల్ల తలెత్తిన నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర, ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదలకు జరిగిన నష్టాలకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 50 మంది వరకూ మరణించారని, ఒక్క GHMC పరిధిలో 11 మంది వరదల వల్ల చనిపోయారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నష్టాన్ని సుమారు రూ.2 వేల కోట్లుగా అంచనా వేశారు.
హైదరాబాద్ పరిధిలో వరదలకు ప్రభావితమైన ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేసేందుకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు GHMCకి తక్షణ సాయం కింద రూ.5 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. వరదలకు పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు మంజూరు చేయిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటే మరమ్మతుల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here