విజయవాడలో దారుణం…ప్రేమోన్మాది ఘాతుకం… యువతి మృతి

0
202

మరోసారి విజయవాడ నగరం ఉలిక్కిపడింది. బెజవాడలో దారుణం జరిగింది. తనను ప్రేమించట్లేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆపై తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సరిగ్గా రెండు రోజుల క్రితం విజయవాడలో యువతిని సజీవ దహనం చేసిన ఘటన మరవకముందే… ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైపోవడం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది.

విజయవాడలోని క్రీస్తు రాజుపురానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతి భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ చదువుతోంది. క్రీస్తు రాజుపురానికే చెందిన చిన్నస్వామి అనే యువకుడు పెయింటింగ్ మేస్త్రిగా పని చేస్తున్నాడు. చిన్నస్వామి కొంతకాలంగా ప్రేమ పేరుతో తేజస్విని వెంట పడుతున్నాడు. తేజస్విని పలుమార్లు చిన్నస్వామిని వారించినప్పటికీ… అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. తనను ప్రేమించట్లేదన్న కారణంతో తేజస్వినిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఉదయం తేజస్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్కడికి వెళ్లాడు. మాట్లాడాలని చెప్పి తేజస్వినిని బయటకు పిలిచాడు.

తేజస్విని బయటకొచ్చి మాట్లాడగా… మరోసారి ప్రేమ విషయాన్ని ప్రస్తావించాడు. తేజస్విని సున్నితంగా అతని ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో తేజస్వినితో వాగ్వాదానికి దిగిన చిన్నస్వామి ఆమెపై అరవడం మొదలుపెట్టాడు. అదే సమయంలో వెంట తెచ్చిన కత్తితో ఒక్కసారిగా ఆమె మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తేజస్విని అక్కడికక్కడే కుప్పకూలింది. ఆపై చిన్నస్వామి తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. గమనించిన స్థానికులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తేజస్విని మృతి చెందింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు చిన్నస్వామి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటికొచ్చి మరీ యువతిపై దాడి చేశాడంటే… తననెవరూ ఏమీ చేయలేరన్న మనస్తత్వమే ఉన్మాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. విస్సన్నపేటకు చెందిన నర్సు సజీవ దహనం ఘటనను జీర్ణించుకోకముందే మరో ఘటన జరగడం దారుణమన్నారు. దిశ,నిర్భయ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here