విజయవాడలో దారుణం… యువతి సజీవ దహనం

0
122

విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమను తిరస్కరించి తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో ఓ యువకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి చిన్నారిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె నాలుగు రోజుల క్రితం గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఆ యువకుడ్ని పిలిచి హెచ్చరించారు. ఆమె జోలికి వెళ్లనని పోలీసులకు రాసిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె కూడా తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో విధులకు హాజరైన చిన్నారి.. ఆస్పత్రి సమీపంలో ఉంటున్న గదికి రాత్రి 9 గంటలకు ఒంటరిగా వెళుతుండగా.. నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. అతడికి మంటలు అంటుకున్నాయి.

ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here