విద్యారంగంలో సంచలన మార్పు… ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

0
171

ఏపీలో నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న వైసీపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం రాష్ట్రంలోనే తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వచ్చే నెల 2 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు పంపింది.

ఇకపై ఏపీలోని పాఠశాల హాజరు పట్టీలో విద్యార్ధుల కులం, మతం వివరాలు కనిపించవు. ఇన్నేళ్లుగా విద్యార్ధులకు రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం నమోదు చేసిన వీటిని ఇకపై హాజరు పట్టీ నుంచి తొలగించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా దీన్ని కూడా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిన వీరభద్రుడు ఆదేశించారు. అయితే స్కూలు రికార్డుల్లో మాత్రం వీటిని నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే విద్యార్ధుల కులం, మతాల ఆధారాలు అందుబాటులో ఉండబోతున్నాయి.

ఇదే కోవలో ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఇకపై పాఠశాల విద్యార్ధుల హాజరు పట్టీలో బాలికల పేర్లను ఎర్రసిరాతో రాసే మరో విధానానికి కూడా ప్రభుత్వం మంగళం పాడింది. ఒకే పాఠశాలలో, ఒకే తరగతి గదిలో, ఒకే తరహాలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, బాలురను వేర్వేరుగా చూపించేలా ఉన్న ఈ విధానం కూడా తొలగించాలని పాఠాశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ఒకే క్లాస్‌లో ఉన్న అందరు విద్యార్ధుల పేర్లు ఎలాంటి కుల, మతాల ప్రస్తావన కానీ, ఎర్రసిరా కానీ లేకుండా ఒకేలా దర్శనమివ్వబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here