వ్యాక్సిన్ ఇప్పట్లో అసాధ్యం..

0
90

మరో 73 రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ వస్తోందంటూ మీడియాలో వస్తున్న వార్తలను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇండియా ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కొవి‌షీల్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. టీకా ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ట్విటర్ వేదికగా ఒక ప్రకటన చేసింది.

భారత్‌లో 73 రోజుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందివ్వడానికి నిర్ణయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ స్పందించింది.

సీరమ్‌ సంస్థకు చెందిన కొవి‌షీల్డ్ వ్యాక్సిన్‌ మరో 73 రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న వార్తలు అసత్యం. ప్రస్తుతం వ్యాక్సిన్‌ తయారుచేసి, భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని నిల్వ చేయడానికి మాత్రమే ప్రభు త్వం మాకు అనుమతి ఇచ్చింది. పరీక్షలు విజయవంతమై, అవసరమైన అనుమతులు లభించిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుంది’ అని సీరమ్ సంస్థ పేర్కొంది.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌‌పై మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని రుజువైన తర్వాతే దాని లభ్యతపై సీరమ్‌ సంస్థ అధికారికంగా ప్రకటన చేస్తుందని స్పష్టం చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి విక్రయించేందుకు పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్.. బ్రిటన్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని 92 దిగువ, మధ్య ఆదాయ దేశాలకు టీకా సరఫరా చేయనున్నట్లు సీరమ్ సంస్థ గతంలో ప్రకటించింది. టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ఉత్పత్తి పెంచేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌తో సీరమ్ సంస్థ ఒప్పదం కుదుర్చుకుంది. దీని ద్వారా 150 మిలియన్‌ డాలర్ల మూలధనాన్ని పొందనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here